Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర ఆర్థిక మంత్రి ఆస్తులలో క్షీణత.. ప్రధాని ఆస్తులలో పెరుగుదల!

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆస్తులు తరిగిపోయాయి. ఏడాదిలో ఆరు కోట్ల రూపాయల మేర తరుగుదల కనిపించింది. 2014-15లో రూ.67.01 కోట్లు ఉన్న ఆస్తులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 60.99 కోట్లకు పడిపోయాయి. ‘‘2015-16లో జైట్లీ చర, స్థిరాస్తుల విలువ రూ.60.99 కోట్లు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆస్తి రూ.67.01 కోట్లు’’ అని ప్రధానమంత్రి అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన డాటా పేర్కొంది. కాగా, ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు రూ.15 లక్షల మేర పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.1.26 కోట్లు ఉన్న మోదీ ఆస్తులు 2014-15లో రూ.1.41 కోట్లకు పెరిగాయి. జైట్లీకి తన భార్యతో కలిపి ఉమ్మడిగా ఢిల్లీ, గుర్‌గాం, అమృత్‌సర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఆరు ఇళ్లు ఉన్నాయి. అలాగే భూములు, వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నట్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. హెచ్‌‌డీఎఫ్‌సీలో మూడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకటి కలిపి మొత్తంగా జైట్లీకి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. గతేడాది రూ.3.52 కోట్లు ఉన్న ఆయన బ్యాంకు బ్యాలెన్స్ ఈసారి కోటి రూపాయలకు తగ్గింది. బ్యాంకు ఖాతాల్లో నిల్వలు తగ్గిపోవడం వల్లే మొత్తం సంపద విలువ తగ్గినట్టు జైట్లీ పేర్కొన్నారు. ఇక ఆయనకు 5.54 లక్షల విలువైన 15 కేజీల వెండి, రూ.1.35 కోట్ల విలువైన 5.6 కేజీల బంగారం, రూ.45 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. రెండు మెర్సిడెజ్ బెంజ్‌లు, హోండా అకార్డ్, టయోటా ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. ఈ ఏడాది వాటికి రూ.86 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు జత కలిసింది. ఓ సంస్థలో రూ.8 కోట్లు, ఆయిల్ కంపెనీల్లో రూ.9 కోట్ల పెట్టుబడులు ఉన్నట్టు జైట్లీ పేర్కొన్నారు.

More Telugu News