మీడియాపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
తాజాగా హైదరాబాదులో అరెస్టయి, ప్రస్తుతం పోలీస్ రిమాండులో వున్న ఉగ్రవాదులకు న్యాయసాయం అందిస్తానని తాను చెప్పిన విషయాన్ని వివాదం చేయడంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 నిమిషాల పాటు ప్రసంగం చేస్తే అందులో 20 నిమిషాలపాటు ఐఎస్ఐఎస్ ను తీవ్రస్థాయిలో విమర్శించానని అన్నారు. దానిని పక్కన పెట్టేసి, అమాయకులకు అన్యాయం జరగకుండా న్యాయసాయం చేస్తానన్న వ్యాఖ్యలను పట్టుకుని వివాదం చేశారని ఆయన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐసిస్ కు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో అమాయకులకు అన్యాయం జరగకూడదనేదే తమ వాదన అని అన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఎన్ఐఏ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని హిందు రాష్ట్రంగా మార్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని, ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేసేందుకు బీజేపీ పావులు కదుపుతోందని ఆయన విమర్శించారు.