24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు
ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకొని అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయని, దీనివల్ల రాగల 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.