Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్ఐఏ అదుపులో ఉన్న యువకులకు న్యాయ సహాయం అందిస్తాం: అసదుద్దీన్ ఒవైసీ

ఉగ్రవాదులుగా అనుమానిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసిన హైదరాబాద్ యువకులకు న్యాయ సహాయం అందించనున్నట్టు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అయితే తాము ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సమర్థించబోమని అన్నారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా మక్కా మసీదులో నిర్వహించిన ‘జమాతుల్ విదా’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్ఐఏ అరెస్ట్ చేసిన యువకుల తల్లిదండ్రులు తనను కలిసి వారు అమాయకులని చెప్పినట్టు తెలిపారు. దీంతో వారికి న్యాయ సహాయం అందించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ‘‘యువకులు అమాయకులైతే చూస్తూ ఊరుకోలేం. పోరాడతాం’’ అని అన్నారు. తమ అదుపులో ఉన్న యువకులు మూడు నాలుగేళ్ల తర్వాత నిర్దోషులని తేలితే వారిని అరెస్ట్ చేసిన అధికారులను సస్పెండ్ చేస్తామని ఎన్ఐఏ రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఐదుగురు పాతబస్తీ యువకులను రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాదుల తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాట్లాడిన దేశంలోని మొదటి ముస్లిం నేతను తానేనని ఒవైసీ పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు ఇండియా నుంచి వెళ్తున్న వారిని పిరికిపందలుగా అభివర్ణించిన ఆయన ఇండియా ముస్లింలు ఎప్పుడూ దేశాన్ని వీడరన్నారు. ‘‘మేమెప్పుడూ దేశాన్ని వీడం. ఇక్కడే ఉండి మా హక్కుల గురించి పోరాడుతూనే ఉంటాం. ఇక్కడే చచ్చిపోతాం. కానీ దేశాన్ని మాత్రం విడిచిపెట్టం’’ అని ఒవైసీ స్పష్టం చేశారు.

More Telugu News