Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ దుస్తుల ఖరీదు కంటే... మా ప్రచార బడ్జెట్ తక్కువే!: లెక్కలేసి మరీ చెప్పిన కేజ్రీ

అవినీతిని అంతం చేస్తామంటూ ఢిల్లీలో అధికార పగ్గాలు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఫక్తు పొలిటీషియన్ లానే మారిపోయారంటూ ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలను తప్పికొట్టేందుకు రంగంలోకి దిగిన కేజ్రీవాల్... తనదైన శైలిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం తన ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకునేందుకు కేజ్రీ సర్కారు ఏకంగా రూ.526 కోట్లను వెచ్చించిందన్న వార్తలను కేజ్రీ నేటి ఉదయం తిప్పికొట్టారు. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు తమ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.76 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. ఇక ఈ ఖర్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల కాలంలో ధరించిన దుస్తుల ఖర్చు కంటే కూడా తక్కువేనని ఆయన మరో వాదనను వినిపించారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి రూ.2 లక్షల విలువ ఉన్న డ్రెస్ లను వేసుకుంటున్న మోదీ... ఒకసారి వేసుకున్న డ్రెస్ ను రెండో దఫా వాడటం లేదని చెప్పారు. ఈ లెక్కన 700 రోజుల పాలనను పూర్తి చేసుకున్న మోదీ రోజుకు రూ.10 లక్షల చొప్పున కేవలం డ్రెస్సులకే రూ.70 కోట్లు తగలేశారని ఆరోపించారు. ఇక ఇతర దుస్తుల ఖర్చు రూ.5 కోట్ల మేర ఉంటుందని చెప్పిన కేజ్రీ ప్రధాని కేవలం రెండేళ్లలో తన దుస్తుల కోసం రూ.75 కోట్లను తగలేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రధాని మార్చిన దుస్తుల ఖరీదు ముందు తమ ప్రభుత్వ ప్రచారానికైన ఖర్చెంత? అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News