తెలంగాణలో పుట్టిన బిడ్డకు ఇకపై 20 నిమిషాల్లోనే ‘ఆధార్’, జనన ధ్రువీకరణ పత్రాలు
తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ శిశు ఆధార్ పేరుతో రూపొందించిన ఈ కొత్త పథకం ద్వారా పుట్టిన ప్రతిబిడ్డకు 20 నిమిషాల్లోనే ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారాన్ని ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ కే కల్పించనున్నారు. ఈ పథకాన్ని హైదరాబాద్ లోని నయాపూల్ ప్రసూతి ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా వారం రోజులు అమలు చేస్తారు. జులై 15 నాటికి పేట్ల బురుజు, కోఠి ఆసుపత్రి, నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అమలు కానుంది. జీహెచ్ ఎంసీ, తెలంగాణ ఐటీ శాఖ, ఆధార్ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త నిర్వహణలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. దశలవారీగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.