నా కుమార్తెను కాపాడాలని ఒక్కరైనా అనుకోలేదు: చెన్నై టెక్కీ స్వాతి తండ్రి వేదన
నిత్యమూ బిజీగా ఉండే రైల్వే స్టేషనులో తన కుమార్తెను దారుణంగా నరికి చంపుతున్నా, చుట్టూ ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉన్నారే తప్ప ఒక్కరైనా కాపాడేందుకు ముందుకు రాలేదని, చివరికి రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతున్నా, పోలీసులకు ఫోన్ చేశారే తప్ప, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఒక్కరికైనా అనిపించలేదని చెన్నైలో హత్యకు గురైన స్వాతి తండ్రి సంతాన గోపాల కృష్ణన్ వాపోతున్నారు.
తన కుమార్తె హత్య జరిగి నాలుగు రోజులైనా, నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల వద్ద ఉన్నా, ఆ కిరాతకుడిని ఇంకా పట్టుకోలేదని ఆరోపించారు. చాలా మంది వచ్చిన రైలు ఎక్కి వెళ్లిపోయారే తప్ప తన కుమార్తెను పట్టించుకోలేదని ఆయన ఏడుస్తూ వ్యాఖ్యానించారు. కనీసం త్వరితగతిని తన కుమార్తె స్వాతిని ఆసుపత్రికి చేర్చివుంటే, అవయవాలను దానం చేసైనా ఉండేవాళ్లమని, తద్వారా మరో నలుగురిలో తన కుమార్తెను చూసుకునేవాళ్లమని వేదనగా చెప్పారు. పోలీసులు తీరికగా వచ్చే సరికి ఆమె ప్రాణాలు పోయాయని తెలిపారు. కాగా, ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో నిందితుడిని రెండు రోజుల్లోగా అరెస్ట్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.