పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసే సమయం ఆసన్నమైందని జమ్మూకశ్మీర్ బీజేపీ వ్యాఖ్యానించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన బీజేపీ.. కేంద్రం సత్వరమే ఈ విషయంలో చొరవ తీసుకుని పాకిస్థాన్ సరిహద్దు వ్యాప్తంగా ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసేలా భద్రతా దళాలకు ఆదేశాలివ్వాలని కోరింది. ఉగ్రవాదుల విషయంలో మెతక వైఖరి వీడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గుప్తా పేర్కొన్నారు.
‘‘ఇప్పటికే చాలా అయింది. సరిహద్దు చుట్టూరా ఉన్న ఉగ్రవాదుల క్యాంపులను ధ్వంసం చేసే సమయం వచ్చేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేసేందుకు భద్రతా దళాలకు ఆదేశాలివ్వాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిలో మరణించిన బీఎస్ఎఫ్ జవాన్ల కుటుంబాలకు అన్ని రకాలుగా చేయూత అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. చదువుకున్న కశ్మీరీ యువత ఉగ్రవాదంలో చేరుతుండడంపై ఆయన స్పందిస్తూ.. స్కూళ్లు, కాలేజీలు, ప్రొఫెసర్లు, మత బోధకులు వారిని ప్రేరేపిస్తూ ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వేర్పాటువాద నాయకులకు కల్పిస్తున్న భద్రతను ఎత్తివేయాలని వీరేందర్ గుప్తా డిమాండ్ చేశారు.