రైతుల క‌ష్టాలు తీర్చాల‌నే లక్ష్యంతో ప్ర‌భుత్వం ఉందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలులో రెండో విడత రుణ ఉప‌శ‌మ‌న ప‌త్రాల పంపిణీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రుణ విముక్తి చేసేందుకే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని, తమ ప్ర‌భుత్వం రుణ‌మాఫీ చేయ‌ట్లేదంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ‘మీ స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి ఎన్నిక‌ల ముందు పాద‌యాత్ర చేశాను. ఆరోజు రైతుల ఇబ్బంది చూసి చ‌లించిపోయాను. రైతులకు అప్పు అనే స‌మ‌స్య తీవ్రంగా వెంటాడుతోందని గ్ర‌హించాను. ఇప్పుడు మీ క‌ష్టాల‌ను తీర్చేందుకే శ్ర‌మిస్తున్నాను’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ‘నా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు, అప్పు చేయాలంటే భార‌త ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వు. ఎన్ని క‌ష్టాలున్నా రైతు రుణ‌మాఫీ విష‌యంలో వెన‌క్కిత‌గ్గ‌లేదు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘మ‌నకొచ్చే రెవెన్యూ ఆదాయం చాలా త‌క్కువ‌, విభ‌జ‌న త‌రువాత‌ ఏపీ రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు ఎన్నో ఇబ్బందులు వ‌చ్చాయి. నేను రైతు బిడ్డ‌ను కాబ‌ట్టి రైతుల క‌ష్టాలు నాకు తెలుసు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నేను మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాను కాబ‌ట్టి రుణ విముక్తి చేస్తున్నా’న‌ని ఆయ‌న అన్నారు.