ఓ శిశువును ఎత్తుకెళ్లిన మహిళా కిడ్నాపర్ 12 రోజుల తర్వాత ఆ పిల్లాడిని ఓ ఆస్పత్రి వద్ద వదిలి వెళ్లింది. బాలుడితో పాటు ఓ నోట్‌ను కూడా అక్కడ పెట్టింది. ‘‘దేవుడా.. బాబును ఎత్తుకెళ్లినందుకు నన్ను క్షమించు.. శిశువు తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు వేడుకుంటున్నా’’ అని అందులో రాసుంది. భోపాల్‌లోని హోసంగాబాద్ జిల్లా పిపారియాలో ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసింది. అయితే అది తప్పని భావించిన ఆమె సరిగ్గా 12 రోజుల తర్వాత భోపాల్‌లోని హమీదియా ఆస్పత్రి ఆవరణలో వదిలివెళ్లింది. బాబుతో ఆస్పత్రికి వచ్చిన ఆమె 14 ఏళ్ల హుమా వద్దకు చేరుకుని బాబును కాస్త చూస్తుండమని, వెంటనే వచ్చేస్తానని చెప్పి ఓ బ్యాగును చేతికిచ్చి వెళ్లింది.
ఆమె ఎంతకీ రాకపోవడంతో హుమా పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చి ఆమె ఇచ్చిన బ్యాగును తనిఖీ చేయగా అందులో ఓ లేఖ కనిపించింది. తనకు ముగ్గురు అమ్మాయిలే ఉన్నారని, అత్తమామల వేధింపులు భరించలేక బాబును కిడ్నాప్ చేసినట్టు పేర్కొంది. అయితే అది తప్పని తెలిసి బాబును వదిలి వెళ్తున్నట్టు తెలిపింది. శిశువు తల్లిదండ్రులు తనను క్షమించాలని వేడుకుంటూ వారి వివరాలను అందులో రాసింది. ఆ లేఖ ఆధారంగా పోలీసులు బాబును అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.