ముద్రగడ అరెస్టు... రాజమహేంద్రవరం తరలింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముద్రగడ అరెస్టు... రాజమహేంద్రవరం తరలింపు

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన నివాసం వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన్ని అరెస్టు చేసి.. రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ముద్రగడ అనుచరులను కూడా అరెస్టు చేసి వాహనాల్లో తరలిస్తున్నారు. కాగా, తుని ఘటనకు సంబంధించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఈరోజు ఉదయం దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, ముద్రగడ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముద్రగడ నివాసంలోకి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముద్రగడను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ముద్రగడను అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలను చూపించాలని కోరడంతో సీబీసీఐడీ అధికారులు కొన్ని పత్రాలను తీసుకువచ్చి చూపించారు. అయితే, ముద్రగడ అనుచరులు దీనికి సంతృప్తి చెందలేదు. కొంచెం సేపు అక్కడే నిరీక్షించిన పోలీసులు, తర్వాత ముద్రగడ అనుచరులను రాజమహేంద్రవరం తరలించారు. అనంతరం ముద్రగడను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడి పరిస్థితులను ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ, ఎస్పీ రవిప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు.

More Telugu News