Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పురుగుల మందు డబ్బా చేతబట్టిన ముద్రగడ.. కిర్లంపూడిలో హైటెన్షన్

కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేతిలో పురుగు మందు డబ్బా ప్రత్యక్షమవడంతో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో హైటెన్షన్ నెలకొంది. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తీరని నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముద్రగడ కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చారు. కాపు నేతల అడ్డగింపుతో ముద్రగడపై కేసు నమోదు చేశామంటూ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకుని తన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే పురుగుల మందు తాగుతానని హెచ్చరించిన ఆయన తన చేతిలోని పురుగుల మందు డబ్బాను పోలీసులకు చూపారు. దీంతో కాపులంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసులను అడ్డుకునేందుకు వారు శతధా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

More Telugu News