అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదట!... అందులోని భాషను మాత్రమే సరిదిద్దారట!
భారత రాజ్యాంగ నిర్మాత ఎవరంటే... చిన్న పిల్లాడు ఠక్కున చెప్పే సమాధానం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరే. అయితే ఏబీవీపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇటీవలే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చైర్మన్ గా నియమితులైన రామ్ బహదూర్ రాయ్ మాత్రం...రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాదని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని, వేరే వ్యక్తులు రాసిన రాజ్యాంగంలో భాషను అంబేద్కర్ కేవలం సరిచేశారని సంచలన వ్యాఖ్యలు చేసిన రాయ్ పెద్ద దుమారమే రేపారు.
ప్రముఖ ఆంగ్ల వార పత్రిక ‘ఔట్ లుక్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాయ్ వ్యాఖ్యలపై బీజేపీ దళిత విభాగం దళిత మోర్చా భగ్గుమంది. దళితులకు అనుకూలంగా మోదీ వ్యవహరిస్తున్న వైఖరికి రాయ్ వ్యాఖ్యలు తూట్లు పొడిచేవేనని దళిత మోర్చా నేత దుశ్యంత్ కుమార్ గౌతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత దీనిపై స్పందించిన రాయ్... తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.