రోడ్లపై 37 కేజీల ఇనుప మేకులను ఏరిన బెంగళూరు టెక్కీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్లపై 37 కేజీల ఇనుప మేకులను ఏరిన బెంగళూరు టెక్కీ!

బెనడిక్ట్ జీబాకుమార్... బెంగళూరుకు 2012లో ఐటీ ఉద్యోగిగా వచ్చాడు. బనశంకారీ ప్రాంతంలో ఇల్లు తీసుకుని ఉంటూ, బెల్లండూరులో ఉన్న ఆఫీసుకు నిత్యమూ ఔటర్ రింగు రోడ్డు మీదుగా వెళుతుంటాడు. మార్గమధ్యంలో సిల్క్ బోర్డు వద్దకు వచ్చే వరకు బైకు టైర్లు పంక్చర్ అవుతుండేవి. తొలుత టైర్ల క్వాలిటీ బాగాలేదని సరిపుచ్చుకున్నా, అసలు విషయం తొందర్లోనే తెలిసిపోయింది. రోడ్డుపై ఉన్న అసంఖ్యాక ఇనుప మేకులే బైకుల పంక్చర్లకు కారణమని గమనించిన బెనడిక్ట్, తనలా మరొకరు ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాడు. జూలై 2014 నుంచి తనకు కనిపించే మేకులను సేకరించడం ప్రారంభించాడు. ఇన్ టుయిట్ టెక్నాలజీ సర్వీసెస్ లో సిస్టమ్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బెనడిక్ట్. "రెండేళ్లుగా రోడ్లపై ఉన్న మేకులను ఏరడం నా విధుల్లో భాగమైంది. తొలుత ఉత్త చేతులతో మేకులను ఏరేవాడిని. ఇప్పుడు ఓ మ్యాగ్నటిక్ స్టిక్ ను వాడుతున్నాను. ఆఫీసుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ మేకుల కోసం చూస్తుంటాను" అని చెబుతున్నాడు. అలా ఇప్పటివరకూ బెనడిక్ట్ 37 కిలోల ఇనుప మేకులను రోడ్డుపై సేకరించడం గమనార్హం. ఆయన 'మై రోడ్, మై రెస్పాన్సిబిలిటీ' పేరిట ఫేస్ బుక్ లో ఓ పేజీ ఓపెన్ చేసి తాను సేకరించిన మేకుల గురించి చెబుతూ ఫేమస్ అయిపోయాడు. ఈ సంవత్సరం మార్చి 21న 1,654 మేకులు బెనడిక్ట్ కంటపడ్డాయట. బైకులకు పంక్చర్ కావాలనే, ఎవరో వీటిని విసురుతున్నారన్నది ఆయన అనుమానం. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కూడా బెనడిక్ట్ కోరుతున్నాడు.

More Telugu News