స్మార్ట్ ఫోన్లు వద్దే వద్దు: ఉద్యోగులతో మోదీ సర్కారు!
కమ్యూనికేషన్ వ్యవస్థలో స్మార్ట్ ఫోన్లు సర్వసాధారణం అయిపోయిన నేటి తరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్మార్ట్ ఫోన్లకు దూరం కావాలని నరేంద్ర మోదీ సర్కారు సూచిస్తోంది. ఫోన్ల హ్యాకింగ్, డేటా థెఫ్ట్ ఘటనలు పెరుగుతున్నాయని, అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని, సున్నితమైన ఆఫీసు కార్యకలాపాలకు సంబంధించి ఈ తరహా ఫోన్లలో చర్చలు వద్దని సూచిస్తోంది. రెండు రోజుల పాటు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై సదస్సు జరుగగా, పారామిలటరీ విభాగంలో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా తొలగించాలని దీని స్థానంలో ల్యాండ్ లైన్లు వాడాలని నిపుణులు సలహాలు ఇచ్చారు.
స్మార్ట్ ఫోన్ల ద్వారా అధికారిక పనులు జరపడంతో విద్రోహులకు, హ్యాకర్లకు సులువుగా సమాచారం బట్వాడా అవుతోందని, దీనిపై మరింత చర్చ జరిపి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని ఈ సదస్సులో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. హోం శాఖతో పాటు రక్షణ, విదేశీ వ్యవహారాలు తదితర శాఖల్లో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నిలిపేస్తేనే మంచిదని, దీంతో చైనా, పాక్ హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చని సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.