నవ్యాంధ్రకు ‘లోటు’ పోటు!... భర్తీ బాధ్యత కేంద్రానిదేనంటున్న చంద్రబాబు సర్కారు!
రాష్ట్ర విభజనతో అధిక ఆదాయం వస్తున్న హైదరాబాదు తెలంగాణకు వెళ్లిపోవడంతో 13 జిల్లాలతో ఓ ముక్కగా మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక లోటులో చిక్కుకుంది. విభజన జరిగిన తర్వాత రూ.16,079 కోట్ల లోటు బడ్జెట్ తో పయనం ప్రారంభించిన ఏపీ కేంద్రంపైనే భారం వేసి నెట్టుకొస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఈ ఆర్థిక లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి లోటు భర్తీ నిమిత్తం కేవలం రూ.2,803 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
ఇదిలా ఉంటే, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా... ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ఆర్థిక లోటు మరో రూ.4 వేల కోట్ల మేర పెరిగింది. పదో వేతన సవరణ కారణంగా ఏర్పడ్డ ఈ లోటును ప్రభుత్వమే భర్తీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం వాదిస్తోంది. పీఆర్సీని ఓ పది నెలలు ముందుగానే అమలు చేసిన ఫలితంగా ఏర్పడ్డ ఈ అదనపు లోటును భర్తీ చేయాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ పీవీ రమేశ్ చెప్పారు.