ఉగ్రవాద గ్రూపుల్లో మనవారిని చొప్పించాలని క్యాబినెట్ కు హోం శాఖ సలహా
ప్రపంచానికి పెను సవాలుగా పరిణమించిన ఉగ్రవాదులను అడ్డుకోవాలంటే, వారి ప్లాన్లు, దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే పొందాల్సి వుందని, అదంత సులువు కాదు కాబట్టి ఉగ్రవాదుల్లోనే మనవారిని చొప్పించాలని కేంద్ర హోం శాఖ మోదీ క్యాబినెట్ కు సూచించింది. టెర్రరిస్టు గ్రూపులైన లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్ వంటి సంస్థల్లో భారత హోం శాఖ నుంచి ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన వారిని సీక్రెట్ గా పంపేందుకు అనుమితించాలని క్యాబినెట్ ను హోం శాఖ కోరింది. ఇది సఫలమైతే, వారి ఎత్తులను సరైన సమయంలో తెలుసుకోవచ్చని వివరించారు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ వంటి కౌంటర్ టెర్రరిజం సంస్థలు వీరిని ఎంపిక చేస్తాయని, ఉగ్ర సంస్థల్లోకి మనవారిని పంపే అధికారం కల్పించాలని కోరింది. కాగా, ప్రస్తుతం వివిధ దేశాల్లోని ఇంటెలిజెన్స్ వర్గాలతో ఉన్న సత్సంబంధాలతో రా అధికారులు ఉగ్రవాద చర్యలపై ముందస్తు సమాచారాన్ని అందుకుంటున్నారు. ఇక ఉగ్రవాద సంస్థల్లో మనవారుంటే, వారిని ఇంకా బాగా ఎదుర్కోవచ్చన్నది హోం శాఖ ఆలోచన.