ఇంత పొట్టి డ్రెస్సుతోనా? పూణెలో ఇది చెల్లదంటూ యువతిపై దాష్టీకం... వారం తరువాత కేసు!
"ఇంత పొట్టి దుస్తులు వేసుకుని ఇద్దరు పురుషులతో ఒకేసారి ఉన్నావు. పూణెలో ఇది చెల్లదు" అంటూ 22 సంవత్సరాల యువతిని కారులోంచి కిందకు లాగి, దుర్భాషలాడుతూ, చెయ్యి చేసుకున్న ఘటనపై వారం రోజుల తరువాత కేసు పెట్టేందుకు పోలీసులు అంగీకరించారు. మే1న జరిగిన ఈ ఘటన గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, తన స్నేహితురాలి వివాహం ముందు జరిగే సంగీత్ వేడుకకు జరుగుతున్న రిహార్సల్స్ లో పాల్గొనేందుకు వెళ్లిన యువతి, ఇద్దరు పురుషులతో కలిసి తెల్లవారుఝామున 5:30 గంటల సమయంలో ఇంటికి బయలుదేరింది.
లుల్లానగర్ సిగ్నల్స్ వద్దకు వచ్చిన తరువాత, వారి కారు పక్కనే మరో కారు వచ్చి ఆగింది. ఆ కారులోని వారు అద్దాలు తెరచి, యువతిని చూశారు. ఆపై కారును వెంబడిస్తూ, తిట్టడం మొదలు పెట్టారు. కాసేపటి తరువాత కారును ముందుకు తెచ్చి, అడ్డంపెట్టి ఆమెను బయటకు లాగారు. "నాకెంతో భయం వేసింది. నా స్నేహితులు అడ్డుకోకుంటే, నాపై అత్యాచారం చేసేవాళ్లేమో" అని సదరు యువతి మీడియాకు వెల్లడించింది. కారులో నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు 100 డయల్ చేస్తే, ఎవరూ ఎత్తలేదని, గంట తరువాత పోలీసులు వచ్చారని, తొలుత కేసు నమోదుకు అంగీకరించని పోలీసులు, ఆపై కేసు పెట్టారని తెలిపింది.
కాగా, నిందితులను అమిత్ ముఖేంద్కర్, శుభమ్ గుప్తాలుగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరి కోసం వెతుకుతున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఐఆర్ నమోదు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూణె జోన్-4 డీసీపీ అరవింద్ తెలిపారు.