ఆసుపత్రిలో బెడ్ పై కాలు పెట్టిన ఐఏఎస్!... సోషల్ మీడియాలో విమర్శల జడివాన!
ఆ ఐఏఎస్ అధికారి తన సర్వీసులోనే కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్ గా మారేకంటే ముందు వైద్య విద్యనభ్యసించిన ఆ సివిల్ సర్వెంట్ చేసిన ఓ చిన్న పొరపాటుపై సోషల్ మీడియాలో విమర్శల జడివాన కురిసింది. తాను చేసిన తప్పును అంతగా గుర్తించని ఆయన నెటిజన్ల విమర్శలతో క్షమాపణలు చెప్పుకున్నారు. అయినా ఆ ఐఏఎస్ చేసిన తప్పేంటంటే... ఛత్తీస్ గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న జగదీశ్ సోంకర్... ఇటీవల రాయ్ పూర్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో తనిఖీ సందర్భంగా అక్కడ అందుతున్న సేవలపై ఆయన రోగులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఓ మహిళా రోగితో మాట్లాడిన ఆయన ఆమె ఉన్న బెడ్ పై కాలు పెట్టి నిలుచున్నారు. ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించిన ఓ మీడియా ప్రతినిధి దానిని తాను పనిచేస్తున్న పత్రికలో ప్రచురించారు. వెనువెంటనే సదరు ఫోటో సోషల్ మీడియాకు ఎక్కేసింది. వైద్య విధ్యనభ్యసించిన సదరు ఐఏఎస్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అప్పటిదాకా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని సోంకర్... ఆ తర్వాత తాను చేసిన తప్పును గమనించి సారీ చెప్పారు.
"నేను అనాలోచితంగా చేసిన చర్యకు బాధ్యతగా క్షమాపణ చెబుతున్నాను. ఈ చర్యను సమర్థించుకోవడానికి మాటలు చాలవు. అయితే కావాలని ఇలా చేయలేదు. ఇలాంటి ప్రవర్తన వల్ల సివిల్ సర్వీసు ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అర్థం చేసుకోగలను. అధికారులందరికీ క్షమాపణలు చెబుతున్నా’’ అని సోంకర్ తన సుదీర్ఘ సారీని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
Dear Jagdish Sonkar, IAS 2013 batch, SDM somewhere in Chattisgarh : Be respectful. And don't repeat this again. pic.twitter.com/3d11qVQiiB
— Bharati Chaturvedi (@Bharati09) 4 May 2016