Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిలేశ్ అహంకారి, మూర్ఖుడు!... యూపీ సీఎంపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్య

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ అఖిలేశ్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. మూర్ఖంగా వ్యవహరిస్తున్న అఖిలేశ్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఉమాభారతి ఫైరయ్యారు. అసలు ఉమాభారతి సంచలన వ్యాఖ్యలకు కారణం అఖిలేశ్ యాదవ్ చేసిన ప్రకటనేనట. వివరాల్లోకెళితే... బుందేల్ ఖండ్ లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు మధ్యప్రదేశ్ నుంచి రైలు వ్యాగన్ల ద్వారా నీరు తరలుతోంది. ఈ క్రమంలో యూపీ మీదుగా వెళుతున్న ఓ రైలును అఖిలేశ్ సర్కారు నిన్న ఝాన్సీలో నిలిపేసింది. దీనిపై కేంద్రం జోక్యం చేసుకుందన్న సమాచారంతో అఖిలేశ్ వేగంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని వ్యాఖ్యానించిన అఖిలేశ్... ఇందులో కేంద్రం ప్రమేయం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేశ్ కామెంట్లను తీవ్రంగా పరిగణించిన ఉమాభారతి... ఆయనపై ఘాటుగా స్పందించారు. విద్యావంతుడైన అఖిలేశ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా తాగునీరు, ఆహారం వంటి వాటిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆమె ఘాటుగా స్పందించారు. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే అఖిలేశ్, ఆ తర్వాత ఉమాభారతి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

More Telugu News