సస్పెన్షన్ తీర్మానం కాపీ ఇవ్వలేదన్న రోజా లాయర్... ఇచ్చేశామన్న ప్రభుత్వ న్యాయవాది
నిండు సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట ఆసక్తికర వాదనలు కొనసాగుతున్నాయి. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శితో ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేయించింది. ఈ పిటిషన్ పై రెండు గంటల క్రితం మొదలైన వాదనలు మరికొంత సేపు కొనసాగే అవకాశాలున్నాయి.
ఈ సందర్భంగా రోజా, అసెంబ్లీ కార్యదర్శి లాయర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ నుంచి తన క్లయింట్ ను ఏడాది పాటు సస్పెండ్ చేసిన స్పీకర్... సదరు సస్పెన్షన్ తీర్మానం కాపీని మాత్రం ఇవ్వలేదని రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆరోపించారు. తీర్మానం కాపీ కూడా ఇవ్వకుండా తన క్లయింట్ హక్కులను కాలరాశారని ఆమె ధ్వజమెత్తారు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ కౌన్సెల్ పి.పి రావు ... ఇందిరా జైసింగ్ వాదనను కొట్టిపారేశారు. తీర్మానం కాపీని రోజాకు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయవాదుల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.