వైసీపీ నుంచి ఐదుగురికి... టీడీపీ నుంచి ఒకరికి!: ప్రివిలేజ్ కమిటీ సమన్లు
ఏపీ అసెంబ్లీలో సభా నాయకుడు నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్షుడు కోడెల శివప్రసాద్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఏడాది పాటు సభ నుంచి బహిష్కరణకు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రోజాపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. సభకు వచ్చిన రోజాను సమావేశ మందిరంలోకి అడుగు పెట్టనివ్వకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గంటల తరబడి హైటెన్షన్ నెలకొంది. రోజాను సభలోకి అనుమతించడం లేదని గవర్నర్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయగా, రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని విపక్షం వైసీపీ చెందిన ఐదుగురు సభ్యులు, అధికార పక్షం టీడీపీ చెందిన ఓ సభ్యురాలికి కమిటీ సమన్లు జారీ చేసింది. నేడు తమ ముందు హాజరుకావాలని వారిని ఆ నోటీసుల్లో కమిటీ ఆదేశించింది. నోటీసులు జారీ అయినవారిలో వైసీపీకి చెందిన ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు ఆర్కే రోజా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని)లతో పాటు టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనిత ఉన్నారు.