ఇండియన్ సెక్యూరిటీ రీసర్చర్స్ కు ఫేస్‌బుక్ రూ.4.84 కోట్ల రివార్డు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ఇండియన్ సెక్యూరిటీ రీసర్చర్లకు భారీ రివార్డు అందించింది. హ్యాకర్లు ఫేస్‌బుక్ యూజర్ల అకౌంట్లలోకి ప్రవేశించి, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేసే వీలున్న బగ్స్ పై సదరు సంస్థకు సమాచారాన్ని అందించినందుకు గానూ ఇండియన్ సెక్యూరిటీ రీసర్చర్లకు ఫేస్‌బుక్ రూ.4.84 కోట్లు బహుమతిగా ఇచ్చింది.
ఫేస్‌బుక్‌లో హ్యాకింగ్‌కు కారణమయ్యే బగ్‌లను కనిపెట్టే రీసర్చర్లు ఉన్న దేశాల్లో ఇండియానే అగ్రస్థానంలో వుందని ఆ సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది. భారత్ నుంచి 205 మంది సెక్యూరిటీ రీసర్చర్లు ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఫేస్‌బుక్ నుంచి రూ.4.84కోట్లను అందుకున్న దేశంగా ఇండియన్ రీసర్చర్లు టాప్ ప్లేస్‌లో నిలిచారని ఆ సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఫేస్‌బుక్‌లో హ్యాకింగ్ కు కారణమయ్యే బగ్‌లను కనిపెట్టే ప్రోగ్రాంని ఆ సంస్థ 2011లో మొదలుపెట్టింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రీసర్చర్ల నుంచి 2,400 వాలిడ్ సబ్మిషన్లు స్వీకరించింది. దీనికి గానూ మొత్తం 4.3 మిలియన్ల యూఎస్ డాలర్ల ప్రోత్సాహకాన్ని 8 వందల మందికి అందించింది.