Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీ రణరంగమే!... హాజరవుతానంటున్న రోజా, అడ్డుకుంటామంటున్న అధికార పక్షం

ఏపీ అసెంబ్లీ నేడు రణరంగంగా మారే ప్రమాదం లేకపోలేదు. సభా నాయకుడు సీఎం నారా చంద్రబాబునాయుడు సహా సభాధ్యక్ష స్థానంలోని స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే కోర్టులను ఆశ్రయించిన ఆమెకు నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఊరట కలిగించింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు కాపీ చేతికందిన వెంటనే అసెంబ్లీకి వెళతానంటూ రోజా కోర్టు వద్దే ప్రకటించారు. తీర్పు కాపీ తీసుకుని ఆమె నేరుగా అసెంబ్లీకి కూడా వెళ్లారు. అయితే అప్పటికే సభ వాయిదా పడిన నేపథ్యంలో ఆమె తిరిగి వచ్చేశారు. సస్పెన్షన్ కు గురైన రోజాను ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో అడుగుపెట్టనిచ్చేది లేదని టీడీపీ సర్కారు తేల్చి చెబుతోంది. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ నిర్ణయం వెలువడే దాకా రోజాను సభలోకి అడుగుపెట్టనివ్వరాదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ నేడు రోజా అసెంబ్లీకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. రోజాకు మద్దతుగా ఆమె పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. రోజాను అడ్డుకుంటే సహించేది లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలో నేడు సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News