ఆస్కార్ విజేత ... ‘ఆంధ్రా’ పచ్చళ్లు!
‘రూమ్’ చిత్రంలో తన నటనకుగాను ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటి బ్రి లార్సన్, టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. లక్ష్మి గతంలో లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. ‘బాస్మతీ బ్లూస్’ అనే చిత్రంలో వాళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ విషయాన్ని లక్ష్మి సామాజిక మాధ్యమం ద్వారా నిన్న తెలిపింది. మరో విశేషం ఏమిటంటే, బ్రి లార్సన్ ఇష్టాయిష్టాల గురించి కూడా లక్ష్మి తాజాగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆంధ్రా పచ్చళ్లు అంటే ఆమెకు మహా ఇష్టమని తెలిపింది. అందుకే, గత ఏడాది జరిగిన తన తమ్ముడు మంచు మనోజ్ వివాహానికి వచ్చిన లార్సన్, తిరిగి వెళ్లేటప్పుడు రకరకాల ఆంధ్రా పచ్చళ్లు పార్శిల్ చేయించుకుని పట్టుకెళ్లిందని, గోంగూర, చింతకాయ పచ్చళ్లంటే ఆమెకు మరీ ఇష్టమని మంచు లక్ష్మి పేర్కొంది.