'దుర్గమ్మ'పై చర్చ ఫలితం... టీవీ యాంకర్ కు 2 వేల బెదిరింపు కాల్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దుర్గమ్మ'పై చర్చ ఫలితం... టీవీ యాంకర్ కు 2 వేల బెదిరింపు కాల్స్!

పార్లమెంటులో స్మృతీ ఇరానీ దసరా ఉత్సవాలను ప్రస్తావిస్తూ, కోల్ కతాలో వేసిన పోస్టర్లలోని వ్యాఖ్యలను చదివి వినిపించి దేశవ్యాప్తంగా కొత్త అలజడి మొదలవడానికి కారణం కాగా, అదే అంశంపై చర్చ చేపట్టిన ఓ మలయాళ టీవీ యాంకర్ కు 2 వేలకు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆసియా న్యూస్ టీవీ చీఫ్ కో-ఆర్డినేటింగ్ ఎడిటర్ సింధూ సూర్యకుమార్ గత వారంలో మహిషాసుర సంహారంపై చర్చను చేపట్టారు. ఈమె తన వ్యాఖ్యానంలో భాగంగా పార్లమెంటులో స్మృతి చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను చదివారు. ఆ మాటల్లో 'సెక్స్ వర్కర్' అన్న పదం కూడా ఉంది. హిందువులు పూజించే దుర్గమ్మను అనరాని మాటలన్నారంటూ, సింధూను చంపేస్తామంటూ బెదిరిస్తూ హిందుత్వ సంఘాల నుంచి ఫోన్ల వెల్లువ మొదలైంది. ఓ వాట్స్ యాప్ గ్రూప్ లో ఆమె ఫోన్ నంబర్ ఉండగా, దాన్ని పంచుకున్న శ్రీరామ సేన, వీహెచ్పీ తదితర సంఘాల కార్యకర్తలు దుర్భాషలాడటం ప్రారంభించారు. "నాకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ తిడుతూ చేసినవే. నిమిషానికి ఓ కాల్ వచ్చేది. నేను స్వయంగా దుర్గామాతను సెక్స్ వర్కర్ అని సంబోధించినట్టుగా వారు ఆరోపిస్తున్నారు. వారంతా నన్ను అదే మాటతో తిడుతూ మనసును బాధిస్తున్నారు. ఫేస్ బుక్ లో నేనేమీ పోస్టులు పెట్టకపోయినా, దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడానని అంటున్నారు" అని సింధు వాపోయారు. కాగా, ఆమె ఫిర్యాదుతో ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తిరువనంతపురం పోలీసు కమిషనర్ జి స్పర్జన్ కుమార్ తెలిపారు.

More Telugu News