సుజనా చౌదరి ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు?: చలసాని శ్రీనివాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుజనా చౌదరి ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు?: చలసాని శ్రీనివాస్

కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబుతున్నారని, అటువంటప్పుడు ఎలా న్యాయం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 17 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటును భర్తీ చేస్తుందని చెప్పారని, అప్పుడు కేంద్రం ఏం చేసిందో అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. 'సుజనా...అప్పుడే ప్రత్యేక హోదా రాదంటారు, అదే సమయంలో ఎలాగైనా ప్రత్యేకహోదా తెచ్చేస్తామని అంటారు. ఆయనకు అదెలా సాధ్యమవుతుందో నాకు మాత్రం తెలియడం లేదు' అన్నారు చలసాని. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి వీరు ఏమాత్రం తడబడడం లేదని ఆయన మండిపడ్డారు. తాజా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు సరికదా, విభజన బిల్లులో పేర్కొన్న కేటాయింపులు కూడా జరగలేదని ఆయన మండిపడ్డారు. మూడేళ్లు ముగుస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం దారుణమని ఆయన దుయ్యబట్టారు. దీనికి నేతల్లో సిగ్గుపడకపోయినా, తాము మాత్రం సిగ్గు పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చేతకాని నేతలు అధికారంలో ఉంటే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయని ఆయన అడిగారు.

More Telugu News