యువతిని బస్సులో బంధించిన కండక్టర్...ఉన్నతాధికారుల జోక్యంతో అరెస్ట్!
ఒక యువతిని బస్సులో బంధించిన కండక్టర్ పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన సంఘటన పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని బెంగళూరు శివారు ఎలహంకలో జరిగింది. ఆ ప్రాంతం డీసీపీ హర్ష తెలిపిన వివరాల ప్రకారం, ఇక్కడి డిజైనింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని రియా అహుజా, ఆమె స్నేహితుడు ఓజస్వి సింగ్ తరగతులు ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరారు. బీఎంటీసీ పరిధిలో నడుస్తున్న బస్సు (కేఏ-ఎఫ్-8022) ఎక్కారు. మహిళలకు కేటాయించిన సీట్ల వరుసలో ఆ విద్యార్థిని కూర్చుంది. ఆమె పక్కనే స్నేహితుడు నిలబడ్డాడు.
దాంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లమని కండక్టర్ అతనికి చెప్పడం, ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ తలెత్తడం జరిగింది. దాంతో ఎలహంక పోలీస్ స్టేషన్ సమీపంలో డ్రైవర్ బస్సును ఆపేశాడు. ఈ నేపథ్యంలో ఓజస్వి సింగ్ ను కండక్టర్ నెట్టివేశాడు. ప్రతిగా అతను కూడా కండక్టర్ ను నెట్టాడు. ఈలోగా కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టడంతో సింగ్ భయపడి, బస్సులోంచి దిగి పారిపోయాడు. దీంతో కండక్టర్ ఆమెను బస్సులో ఉంచి తాళం వేశాడు. విద్యార్థిని స్నేహితుడు తిరిగి వస్తే గానీ, విడిచిపెట్టనని కండక్టర్ చెప్పాడు. ఇతనికి అక్కడి సమీపంలోని పోలీసులు, స్థానికులు వత్తాసు పలికారు. ఇదంతా గమనించిన రియా అహూజా తనకు తెలిసిన ఇతర స్నేహితులకు ఫోన్ చేయడంతో, వాళ్లు వచ్చి కండక్టర్ కు నచ్చచెప్పి ఆమెను విడిపించుకుని వెళ్లారు.
కాగా, ఈ సంఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వెళితే, ఇన్స్ పెక్టర్ నాగరాజ్ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించాడట. దాంతో ఆమె విషయాన్నంతా వివరిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడంతో, పోలీసు ఉన్నతాధికారులు దానినే ఫిర్యాదుగా స్వీకరించి వెంటనే కండక్టర్ ని అరెస్టు చేసి, విచారణకు ఆదేశించారు. ఈ విషయంలో కండక్టర్ ది తప్పని తేలితే తీవ్ర చర్యలు తీసుకుంటామని బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.