జేఎన్ యూ ఆప్ డేట్స్... 'అఫ్జల్ గురు' ఈవెంట్ కు విదేశీ నిధులు లేవు, నినాదాలు బయటి వ్యక్తులవేనట!
పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగిన ర్యాలీ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీని నిప్పుల కుంపటిలా మార్చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీయడమే కాక వర్సిటీ, పాటియాల కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన ఈ ర్యాలీలో విదేశాల నుంచి వచ్చిన నిధులను విద్యార్థులు వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ర్యాలీలో సింగిల్ పైసా కూడా విదేశీ నిధులు వినియోగం కాలేదట. ఈ మేరకు రాజద్రోహం కేసు నమోదైన జేఎన్ యూ విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు విదేశీ నిధుల ప్రస్తావనను కొట్టేశారు.
ఖలీద్, అనిర్బన్ లను నిన్న పోలీసులు దాదాపుగా 12 గంటల పాటు విచారించారు. విచారణలో భాగంగా... ర్యాలీకి తానే రూపకల్పన చేశానని ఖలీద్ చెప్పాడు. తాను పథక రచన చేస్తే, అనిర్బన్ పోస్టర్లను రూపొందించాడని అతడు చెప్పాడు. ఇక ర్యాలీలో వినిపించిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలు వర్సిటీ విద్యార్థులు చేసినవి కాదని అతడు చెప్పాడు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు ఆ నినాదాలు చేశారని అతడు చెప్పినట్లు పోలీసులను ఉటంకిస్తూ ‘హిందూస్థాన్ టైమ్స్’ ఓ కథనాన్ని రాసింది.