వైకాపాకు డెడ్ లైన్ 2019... మా ఎమ్మెల్యేలను తాకే ధైర్యం జగన్ కు లేదు: సోమిరెడ్డి
2019 సంవత్సరం వైకాపాకు డెడ్ లైన్ అని, ఈలోగా అభివృద్ధి వ్యతిరేక విధానాలను వీడకపోతే, జగన్ పై ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆనాడు వైఎస్ఆర్, ఈనాడు కేసీఆర్ లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు జగన్ రాక్షసానందం పొందలేదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యేలు తామంతట తాము పార్టీలోకి వస్తుంటే ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. నేతలు అభివృద్ధిని కోరుకోవడం సహజమేనని, పార్టీలు మారడం కూడా అంతే సహజమని అన్నారు. రాజ్ భవన్ ఎదుట నిలబడి ప్రభుత్వాన్ని పడగొడతామని జగన్ సవాళ్లు విసురుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తాకే ధైర్యం కూడా జగన్ కు లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే సామర్థ్యం అంతకన్నా లేదని ఎత్తిపొడిచారు.