టీఆర్ఎస్ లో చేరికలు సాధారణమైనవి కాదు: కేసీఆర్
తమ పార్టీలో చేరికలు సాధారణమైనవి కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో విద్యాశాఖ బడ్జెట్ పై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఇతర పార్టీలలోని నేతలు టీఆర్ఎస్ లో చేరడం అసాధారణమైన విషయమని అన్నారు. ప్రజా సంక్షేమంలో భాగమయ్యేందుకు ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని గతంలో అన్నవారి చెంప పగిలేలా పాలించి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపిన కేసీఆర్, పాలనను బట్టే చేరికలు ఉంటాయని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతి పథాన నిలబెడతామని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలన ప్రజలే కేంద్ర బిందువుగా సాగుతోందని ఆయన అన్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తామని ఆయన చెప్పారు. నిరుపేదలకు కేజీ టు పీజీ ఉచిత విద్యను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.