: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదమే!... పురపాలకశాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ప్రకటన
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని సాధించిపెట్టిన తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్)కు ప్రమోషన్ లభించింది. కీలకమైన పురపాలక శాఖను ఆయనకు అదనంగా కట్టబెడుతూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే అధికారికంగా ఉత్తర్వులు జారీ కాగా, కాసేపటి క్రితం కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల అధికారులతోను నేటి సాయంత్రం దాకా సుదీర్ఘ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు ముందు పురపాలక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటనలు చేశారు. ఇకపై అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గతంలోలా దురాక్రమణలకు, నిబంధనల అతిక్రమణలకు ఎలాంటి మినహాయింపులు, రాయితీలు ఉండబోవని ఆయన తేల్చిచెప్పారు.