Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వీయ గృహ నిర్బంధంలో ముద్రగడ... కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

కాపులకు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే సతీసమేతంగా ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ, లక్ష్యం నెరవేరే దాకా దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పారు. దీక్ష చేపట్టి మూడు రోజులవుతున్న నేపథ్యంలో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో నేటి ఉదయం వారిద్దరికీ వైద్యులు బలవంతంగా పరీక్షలు చేయబోయారు. అయితే ముద్రగడ వైద్య పరీక్షలకు ససేమిరా అన్నారు. ఈ సమయంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ లు ముద్రగడ ఇంటిలోకి వెళ్లారు. వారి వెంట కొంతమంది పోలీసులు కూడా తన ఇంటిలోకి ప్రవేశించడంతో ముద్రగడ ఆగ్రహోదగ్రులయ్యారు. ఎక్కడ తన దీక్షను భగ్నం చేస్తారోనన్న ఆందోళనతో తన గదిలోకి వెళ్లిన ఆయన తలుపులేసేసుకున్నారు. తద్వారా తనకు తాను స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేకుండా ఇంటిలోకి ప్రవేశించిన జాయింట్ కలెక్టర్, ఎస్సీలతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు.

More Telugu News