పేట్రేగిన ముంబై దాడుల మాస్టర్ మైండ్... ‘పఠాన్ కోట్’ దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరిక
ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరోమారు పేట్రేగిపోయాడు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడుల తరహాలో మరిన్ని దాడులు జరగనున్నాయని అతడు భారత్ కు సవాల్ విసిరాడు. జమాత్ నిర్వాహకుడిగా అంతర్జాతీయ సమాజం కరుడుగట్టిన ఉగ్రవాదిగానే అతడిని పరిగణిస్తుండగా, అతడు మాత్రం పాక్ లో మత గురువు హోదాలో స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగిన వారిని అతడు కీర్తించాడు.
పఠాన్ కోట్ పై దాడి తమ పనేనని ప్రకటించుకున్న యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ధైర్య సాహసాలను సయీద్ పొగిడాడు. పాక్ లోని ముజఫరాబాదులో ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో అతడు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. జమ్మూ కాశ్మీర్ కు విముక్తి కలిగేదాకా భారత్ పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని అతడు పేర్కొన్నాడు. ‘‘ఇప్పటిదాకా పఠాన్ కోట్ దాడిని మాత్రమే చూశారు. భవిష్యత్తులో అలాంటి దాడులు మరిన్ని జరిగితీరతాయి’’ అంటూ అతడు పేట్రేగిపోయాడు. అతడి వ్యాఖ్యలకు అక్కడి జనం పెద్ద పెట్టున నినాదాలు కూడా చేశారు.