రిటైర్డ్ మేజర్ జనరల్ కొడుక్కి ‘టెర్రర్ లింక్స్’... అరెస్ట్ చేసిన గోవా ఏటీఎస్
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల కుటుంబాలే ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో ఇంట దొంగలు కొందరు ఉగ్రవాదులకు సహకరించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారత వైమానిక దళంలో పనిచేసే ఓ కీలక అధికారి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ విసిరిన ‘హనీ ట్రాప్’కు చిక్కి, దేశానికి చెందిన పలు కీలక రహస్యాలను గుట్టుచప్పుడు కాకుండా ఇచ్చేశాడు. తాజాగా ఓ రిటైర్డ్ మేజర్ జనరల్ పుత్రరత్నం ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకెళితే... మూడు రోజుల క్రితం గోవాలోని వాస్కో రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ నడి వయస్కుడిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఏటీఎస్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా సదరు యువకుడి పేరు సమీర్ సర్దానాగా తేలింది. చార్టెర్డ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న సమీర్... యాక్సెంచర్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీలకు కూడా పనిచేశాడు. హాంకాంగ్ మలేసియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లో కూడా పనిచేశాడు. అంతేకాక అతడు ఓ మాజీ సైనికాధికారి (రిటైర్డ్ మేజర్ జనరల్) కొడుకని తేలింది.
దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేయగా, హిందువైన అతడు ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతడు ఐఎస్ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పటిదాకా అతడి వద్ద ఉగ్రవాదులకు సంబందించి పూర్తి ఆధారాలేమీ లభ్యం కాలేదని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని గోవా డీజీపీ టీఎన్ మోహన్ మీడియాకు చెప్పారు.