బతకాలనే ఆశ చచ్చిపోయిందంటూ ఏడుగురు కుటుంబ సభ్యులు అదృశ్యం!
తమకు బతకాలనే ఆశ చచ్చిపోయిందంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టిమరీ, ఏడుగురు కుటుంబ సభ్యులు అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా పటాన్ చెరువు మండలంలోని అమీన్ పూర్ లో జరిగింది. ఈరోజు వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలు..అమీన్ పూర్ లో నివసిస్తున్న బీమయ్య(50) కుటుంబం ఈ నెల 15వ తేదీన శ్రీకాళహస్తికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లారు. అయితే, బీమయ్య పెద్దకూతురు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో అనుమానమొచ్చిన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సహాయంతో వారి ఇంటి తలుపులు తెరిచి చూడగా.. ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది.
వస్త్రాల వ్యాపారంలో నష్టపోయామని, ఇల్లు కట్టేందుకు తెచ్చిన అప్పులు కూడా పెరిగిపోయాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుల బాధ నుంచి బయటపడలేకపోతున్నామని.. దాంతో బతకాలనే ఆశ చచ్చిపోయిందని, కుటుంబసభ్యులమంతా కలిసి శ్రీకాళహస్తిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. బీమయ్య, భార్య నాగమణి, కొడుకు అనిల్, కోడలు హేమలత, మనుమలు ఆయుష్, ఆకాష్, కూతురు సంధ్యతో కలిసి శ్రీకాళహస్తి వెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు బీమయ్య పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.