నిలబడి తడబడిన భారత్...ఐదు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా
టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందన్న దశలో వన్డే క్రికెట్ లో మజాను పంచుతూ ఆస్ట్రేలియా పుంజుకుంది. శిఖర్ ధావన్ (126), విరాట్ కోహ్లీ (106) సెంచరీలతో టీమిండియాను విజయానికి దగ్గర చేస్తున్న దశలో హైస్టింగ్స్ వేసిన బంతిని నేరుగా బెయిలీ చేతుల్లోకి కొట్టిన ధావన్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కూల్ ధోనీ కేవలం రెండు బంతులను ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా స్లిప్స్ లో వేడ్ కు దొరికిపోయాడు. అనంతరం ధాటిగా ఆడిన కోహ్లీ మిడాఫ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ధోనీ అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన గురుకీరత్ సింగ్ (5) మరోసారి తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. భారీ స్వీప్ షాట్ కు ప్రయత్నించి టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో మార్ష్ కు దొరికిపోయాడు. అనంతరం వచ్చిన రహానే (2) స్లిప్స్ లో దొరికిపోయాడు. ధాటిగా ఆడేందుకు యత్నించిన రిషి ధావన్ (9) భారీ షాట్ కు యత్నించి వార్నర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో 44 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది.