ఘటనలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు: స్మృతీ ఇరానీ
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. రోహిత్ ఆత్మహత్యపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆమె వివరించారు. ఏబీవీపీ నేతపై దాడి ఘటనలో బాధితుడి తల్లి హైకోర్టులో కేసు నమోదు చేసిందని, విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని న్యాయస్ధానం ఆదేశించిందని ఆమె చెప్పారు. అందులో భాగంగానే అతనిపై యూనివర్సిటీ చర్యలు తీసుకుందని ఆమె వివరించారు. అనంతరం రోహిత్ మృతి చెందినట్టు యూనివర్సిటీకి జనవరి 17న సమాచారం అందిందని ఆమె తెలిపారు. ఈ ఘటన దళితులు, దళితేతరులకు మధ్య జరిగిన సంఘటన కాదని ఆమె స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.