సెక్యూరిటీ గార్డు హత్య కేసులో కేరళ పారిశ్రామికవేత్త నిషామ్ దోషిగా నిర్ధారణ
కేరళలోని ప్రముఖ బీడీ పారిశ్రామికవేత్త మహ్మద్ నిషామ్... సెక్యూరిటీ గార్డు హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు. ఈ మేరకు త్రిశ్శూర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కేపి సుధీర్ ఆయనను దోషిగా తేల్చినట్టు ప్రకటించారు. గార్డును కారుతో ఢీకొట్టి అతి దారుణంగా హత్య చేయడమే గాకుండా, ఈ కుక్క ఇంకా చావడం లేదంటూ దుర్భాషలాడినట్టు తీర్పు వెల్లడిస్తున్న సమయంలో న్యాయస్థానం పేర్కొంది. రేపు నిషామ్ కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది.
తిరువనంతపురానికి చెందిన నిషామ్ కోటీశ్వరుడు. బీడీ టైకూన్ గా పేరొందిన ఆయన గత సంవత్సరం జనవరిలో తన అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు చంద్రబోస్ తో గొడవపడ్డాడు. ఆ సమయంలో మద్యం సేవించి ఉన్న నిషామ్ గార్డుపై ఆగ్రహంతో తన కారుతో ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన గార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు వారాల తరువాత మరణించాడు. దాంతో నిషామ్ ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. అతను రిమాండ్ లో ఉన్న సమయంలో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ కు కారణమయ్యాడు. అతడిని స్టార్ హోటల్ లో భోజనం చేసేందుకు అనుమతించిన విషయం బయటకు రావడంతో పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉంచితే, నిందితుడికి మరణశిక్ష విధించాలని, గార్డు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.