ఈ నేలపై మానవత్వం మాయమైపోయిందా?... హెచ్ సీయూలో జగన్ ఆవేదన
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నేటి ఉదయం వర్సిటీకి వచ్చిన జగన్, అక్కడ రోహిత్ మద్దతుదారులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వర్సిటీలో జరిగిన ఘటనలపై సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ పెద్దలు కూడా తమను తాము ప్రశ్నించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల అభివృద్ధి శాఖకు రాసిన లేఖను ఆయన పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిదిగా అభివర్ణించారు. రోహిత్ పై చర్యల కోసం కేంద్రం వర్సిటీ అధికారులకు లేఖల మీద లేఖలు రాయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ నేలపై మానవత్వం మాయమైపోయిందా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులతో పాటు వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.