"మనం మరణించాలనుకోవడం లేదు" అన్న స్టీవార్డ్ వ్యాఖ్యలతో విమానంలో గగ్గోలు!
విమాన ప్రయాణం... ఎంత వేగమూ, సౌకర్యవంతమో అందరికీ తెలిసిందే. అదే ప్రమాదం జరిగితే... ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటువంటిది విమానం బయలుదేరితే మనమంతా మరణిస్తాం అన్న ఉద్దేశంతో ఫ్లయిట్ స్టీవార్డ్ పబ్లిక్ అనౌస్సింగ్ వ్యవస్థ ద్వారా మాట్లాడితే, ఇంకేమైనా ఉందా? అదే జరిగింది ఇక్కడ. మరిన్ని వివరాల్లోకి వెళితే...
గ్లాస్గో నుంచి డబ్లిన్ బయలుదేరాల్సిన ర్యాన్ ఎయిర్ బడ్జెట్ విమానం అది. అప్పటికే ప్రయాణ సమయానికి ఎనిమిది గంటలు ఆలస్యం అయింది. ప్రయాణికులంతా అసహనంతో చూస్తున్న వేళ మైకు ద్వారా కొన్ని మాటలు వినిపించాయి. "విమానం రెక్కలపై మంచు పేరుకున్న కారణంగా టేకాఫ్ తీసుకునేందుకు కెప్టెన్ నిరాకరిస్తున్నారు. మనమంతా మరణించాలని అనుకోవడం లేదు కదా?" అని ఓ మహిళా స్టీవార్డ్ వ్యాఖ్యానించడంతో విమానంలో కలకలం రేగింది. ఈ దృశ్యాన్ని అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వీడియో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది. సదరు క్రూ మెంబర్ తో మాట్లాడామని, ఈ తరహా వ్యాఖ్యలు ఆమె నోటి నుంచి వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నామని ర్యాన్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.