బీహార్ రౌడీ రాజ్యం! పోలీసు స్టేషన్ నుంచి పరారైన ఎమ్మెల్యే భర్త!
బీహార్ లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాప్రతినిధులు ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్న వార్తలు నిత్యమూ వస్తున్నాయి. తాజాగా, సుమారు 100 వరకూ క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ పోలీసులకు చిక్కిన బీహార్ మాజీ మంత్రి, ప్రస్తుత అధికార జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే బీమా భారతి భర్త అవదేష్ పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకు పారిపోయాడు. ఓ సాక్షిని బెదిరించిన ఘటనలో పూర్ణియా పోలీసులు ఆయన్ను నిన్న అరెస్ట్ చేసి మరంగ పోలీస్ స్టేషన్ లో ఉంచగా, ఆపై కొన్ని గంటలకే ఎమ్మెల్యే భారతి, ఎంపీ సంతోష్ లు 150 మంది అనుచరులతో స్టేషనుకు వచ్చారు. సంతోష్ పోలీసులతో మాట్లాడుతుండగానే అవదేష్ బయటున్న కారులో కూర్చోవడం, వెంటనే అది దూసుకెళ్లడం జరిగిపోయాయి. ఆపై ఎంపీ కూడా నెమ్మదిగా జారుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై మరో కేసును నమోదు చేయడం మినహా మరేమీ చేయలేకపోయారని తెలుస్తోంది.