గ్రేటర్ లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. గ్రేటర్ పరిధిలోని ఒక్కో డివిజన్ కు పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ పార్టీ 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, ఇంకా ఏడు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ 94 డివిజన్లలో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ- బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ 87 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా, 81 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ 63 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. దీంతో బీజేపీ ఒక్కో డివిజన్ లో ముగ్గురు లేక నలుగురు చొప్పున అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. ఇక ఎంఐఎం పార్టీ 75 స్థానాల్లో అభ్యర్థులతో నామినేషన్లు వేయించింది. ఇంచుమించు ప్రతి స్థానంలోనూ స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య రెండు వేలను మించిందని అధికారులు వెల్లడించారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 21 కాగా, ఫిబ్రవరి 2న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 5న లెక్కింపు జరుగుతుంది.