ప్రైవేటు మాయ!... ఆర్టీసీ సర్వర్ డౌన్... కోట్ల నష్టం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రైవేటు మాయ!... ఆర్టీసీ సర్వర్ డౌన్... కోట్ల నష్టం!

సంక్రాంతి సీజనులో ఆర్టీసీ బస్సులు ఎలా కిటకిటలాడుతాయో అందరికీ తెలిసిందే. రెగ్యులర్ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయి, అదనపు బస్సుల్లో సగం ధర అధికంగా చెల్లించి అయినా గమ్యస్థానాలకు వెళ్లాలని భావించే వారెందరో. ఈ పండగ సీజన్ తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చి పెడుతుంది. ఇటువంటి కీలక సమయంలో మూడు రోజుల పాటు సర్వర్ షట్ డౌన్ అయిపోయింది. టికెట్లు బుక్ చేద్దామంటే, ‘దిస్ సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్’ అన్న మెసేజ్ కనిపించింది. దీంతో ప్రయాణికులంతా ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించగా, ఆర్టీసీ బస్సులు బోసిపోయాయి. ఎంతో ముఖ్యమైన రూట్లుగా భావించే హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - విశాఖపట్నం వంటి రూట్లలో సైతం ప్రయాణికులు కనిపించలేదు. గత సంవత్సరం దసరా, సంక్రాంతి సమయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రైవేటు బస్సు సంస్థల లాబీయింగ్ వల్లే సర్వర్ల షట్ డౌన్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ ఒక్కసారిగా పెరగడం వల్లే సమస్య ఏర్పడిందని కొందరు అంటున్నా, ఉన్నతాధికారులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి వరకూ సర్వర్లలో సమస్యలకు కారణం ఏంటన్న విషయమై ఉన్నతాధికారులూ ఎటువంటి స్పష్టతకు రాలేదని తెలుస్తోంది.

More Telugu News