కృష్ణాజిల్లాలో వెలుగు చూసిన మరో దారుణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణాజిల్లాలో వెలుగు చూసిన మరో దారుణం

గుంటూరు జిల్లా తెనాలిలో కీచకుల నుంచి కూతురును కాపాడేయత్నంలో తీవ్ర గాయాలపాలై మరణించిన తల్లి ఘటన మరువక ముందే, కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో మళ్లీ అటువంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఈసారి దుర్మార్గుల నుంచి చెల్లిని కాపాడుకునే యత్నంలో ఓ అన్న మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈనెల 19న రాత్రి సమయంలో ఓ అన్నా, చెల్లి ఓ వేడుకకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు చెల్లెల్ని వేధిస్తూ వెంటపడ్డారు. సోదరుడు దేవరపల్లి రవితేజ అడ్డుకోవడంతో, తమ మోటార్ సైకిలుతో అతనిని ఢీకొట్టారు. తీవ్ర గాయాలైన రవితేజని ఆసుపత్రిలో చేర్పించగా, ఆ మర్నాడు అతను మరణించాడు.

అయితే, అసలు విషయం చెబితే తనను చంపేస్తామని యువకులు బెదిరించడం వల్లే, అన్న ప్రమాదంలో గాయపడ్డట్టు పోలీసులతో చెప్పినట్టు చెల్లి చెప్పింది. చివరకు తన సోదరుడు మరణించడంతో అసలు విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. ఇంతవరకు నిందితులపై కేసు పెట్టడం గానీ, దర్యాప్తు చేబట్టడం గానీ పోలీసులు చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు కంకిపాడు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి.

More Telugu News