మోదీకి నో ఛాయిస్ ... మంత్రులను మారుద్దామంటే సమర్థులు లేరట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీకి నో ఛాయిస్ ... మంత్రులను మారుద్దామంటే సమర్థులు లేరట!

బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత మోదీ తన క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయనున్నారని మీడియాలో భారీ ప్రచారమే జరిగింది. పనితీరు సరిగ్గా లేని మంత్రులను, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి ఇబ్బందులు తెచ్చిన వారిని తొలగించాలని మోదీ భావిస్తున్నప్పటికీ, సరైన వ్యక్తులు దొరకడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం ఆరంభంలో కొందరు మంత్రుల తొలగింపు ఉండవచ్చని, భారీ స్థాయిలో మార్చేందుకు తగినంత నాణ్యమైన నేతలు లేరని మోదీకి దగ్గరగా మెలిగే బీజేపీ నేత ఒకరు వివరించారు. దీంతో పార్టీ భవిష్యత్తుపై మోదీ ఒత్తిడిలో పడ్డట్లయిందని, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయినా, ఉద్యోగాల కల్పన, వృద్ధి తదితర అంశాల్లో ముందడుగు పడలేదని, సంస్కరణల అమలు సైతం ఆగిందని మోదీ అభిప్రాయపడుతున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ నేత తెలిపారు. సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం ఆయన ముందు పెను సవాలుగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావించినా, ఆర్థిక శాఖను నెరిపేంత సమర్థత మరెవరి వద్దా లేక ఆయన మనోహర్ పారికర్ ను ఎంచుకున్నారని పార్టీ వర్గాలు గతంలోనే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికారికంగా మాట్లాడేందుకు మాత్రం ఏ నేతా అంగీకరించడం లేదు.

More Telugu News