నో రూలింగ్ పార్టీ... నో అపోజిషన్!: అసెంబ్లీకి నాలుగు రోజులు తాళమేయాలన్న గవర్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నో రూలింగ్ పార్టీ... నో అపోజిషన్!: అసెంబ్లీకి నాలుగు రోజులు తాళమేయాలన్న గవర్నర్

అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ విపక్షాల అల్లరికి మారుపేరుగా నిలిచిందని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా అదే స్థాయిలో ఆసక్తికర కామెంట్లు చేశారు. సర్కారీ విద్యపై అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో కొనసాగుతున్న బుక్ ఫెయిర్ ను సందర్శించిన సందర్భంగా నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్కారీ విద్య బాగుపడాలంటే అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు. ‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్... ఏటా అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి. ప్రధానంగా పాఠశాల విద్యపై ప్రత్యేకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అసెంబ్లీకి నాలుగు రోజులు తాళమేసి అయినా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లోని సర్కారీ పాఠశాలల బాగోగులకు సదరు నియోజకవర్గ ఎమ్మెల్యేనే బాధ్యుడిని చేయాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి, పనితీరుపై ఏటా ప్రభుత్వానికి నివేదిక అందాలని, అప్పుడే సర్కారీ విద్య బాగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News