Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కనీస విద్యార్హత లేని వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే తప్పులేదు: సుప్రీంకోర్టు

భారత రాజకీయ వ్యవస్థ, ఎన్నికల విధానంపై పెను ప్రభావం చూపే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నోటి వెంట గురువారం వచ్చాయి. కనీస విద్యార్హతలు లేని వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే తప్పేంలేదని వ్యాఖ్యానించింది. అయితే, ఈ వ్యాఖ్యలు తమ అభిప్రాయమేనని, ఎన్నికల్లో పాల్గొనే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దాన్నెవరూ కాదనలేరని చెబుతూ, హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది. స్థానిక ఎన్నికల్లో కనీస విద్యార్హతలను సూచిస్తూ, హర్యానా సర్కారు నిర్ణయం తీసుకోగా, దాన్ని సవాలు చేస్తూ, పలువురు సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ధర్మాసనం, హర్యానా నిర్ణయాలను నిలుపుతూనే కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నవారే ఎన్నికల్లో పోటీకి అర్హులన్న హర్యానా మరో నిర్ణయంపై కూడా సుప్రీం స్టే విధించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే, పురుషులు 10వ తరగతి, స్త్రీలు 8వ తరగతి, దళితులు 5వ తరగతి చదవడం తప్పనిసరని హర్యానా సర్కారు జీవోతేగా, ఇవి అమలైతే 20 ఏళ్లు నిండిన 83.06 శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ పడే అర్హత కోల్పోతారని పలువురు కోర్టుకెక్కారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ నిర్ణయాలు అమలవుతాయని భావిస్తున్నామని, అందుకు తొలి అడుగు రాజకీయ పార్టీల నుంచి రావాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించింది.

More Telugu News