Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబోయే భర్త అజ్ఞాని అని తెలియడంతో రివర్స్ అయిన యువతి... మధ్యలోనే ఆగిపోయిన పెళ్లి!

కనీస లెక్కలు కూడా తెలియని అజ్ఞానిని తాను వివాహం చేసుకునేది లేదంటూ, పెళ్లి పీటలెక్కిన తరువాత ఓ యువతి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన యూపీలోని మణిపురి జిల్లాలోని గులారియాపూర్ గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కుష్బూ అనే యువతికి, ఓంవీర్ అనే యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహం వైభవంగా మొదలైంది. వేడుకలో భాగంగా మంత్రాలను ఉచ్చరించాలని పురోహితుడు చెప్పినప్పుడు, వాటిని వరుడు సరిగ్గా పలకలేకపోవడంతో వధువుకు తొలి అనుమానం వచ్చింది. మరో పావుగంటలో మొత్తం తతంగమంతా పూర్తవుతుందనే సమయంలో, కొన్ని నాణాలను ఇచ్చి లెక్క పెట్టమంటే, తొమ్మిది తరువాత ఎంతో అతనికి తెలియలేదు. ఆపై మొబైల్ ఫోన్ చేతికిచ్చి తన నంబర్ చెప్పి డయల్ చేయాలని కోరగా, ఆ పని కూడా చేయలేకపోయాడు. ఇక 69, 79 మధ్య తేడా ఎంతని ప్రశ్నించగా, తెల్లమొహమే సమాధానమైంది. ఇక ఓంవీర్ తనకు వద్దంటూ కుష్బూ నిర్ణయం తీసుకోగా, ఆమె తల్లిదండ్రుల నుంచి, ఊరి పెద్దల నుంచి మద్దతు లభించింది. వరుడి విద్యార్హతలపై తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని, నిరక్షరాస్యుడు మాత్రమే కాకుండా, అతనికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయని, ఈ పెళ్లి తప్పిపోవడం తమకు బాధను కలిగించలేదని కష్బూ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. అన్నట్టు, 8వ తరగతి వరకూ చదువుకున్న కుష్బూకు మరింత చదివి ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్నది కోరికట. ఇక కుష్బూ కాదన్న ఓంవీర్ కు ఆ వెంటనే గంటల వ్యవధిలో మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోవడం గమనార్హం.

More Telugu News