ఆసక్తి కలిగిస్తున్న ఐపీఎల్ రూల్స్... లోయస్ట్ బిడ్డర్ కు ధోనీని లాక్కునే అవకాశం!
వచ్చే సంవత్సరం జరిగే ఐపీఎల్ సీజన్ లోకి ప్రవేశించే రెండు కొత్త ఫ్రాంచైజీల పేర్లు ఈ మధ్యాహ్నం వెల్లడికానున్నాయి. బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం, అతి తక్కువ బిడ్డింగ్ వేసి ఫ్రాంచైజీని పొందేవారు దిగ్గజ ఆటగాళ్ల నుంచి తమకు నచ్చిన వారిని తొలుత ఎంపిక చేసుకోవచ్చు. ఈ నిబంధనే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత సంవత్సరం టోర్నమెంటు తరువాత సుప్రీం ఆదేశాల మేరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీములపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఫ్రాంచైజీల ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు హాట్ ఫేవరెట్. తక్కువ బిడ్ దాఖలు చేసిన ఫ్రాంచైజీ తన తొలి ప్లేయర్ పిక్ లో ధోనీని లాగేసుకునే ఛాన్స్ పొందుతుంది. ధోనీ ఉంటే, బ్రాండింగ్ తో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చన్నది ఫ్రాంచైజీల భావన. ఇక ధోనీని ఎవరు తమ టీంలోకి చేర్చుకుంటారన్నది మధ్యాహ్నం తరువాత తేలిపోతుంది. కాగా, ఆటగాళ్ల వేలం 15వ తేదీన జరుగనుంది.